ఢిల్లీ కేంద్రంగా ఎన్నో వేల సంవత్సరాల చరిత్రలో ఎన్నో సామ్రాజ్యాలు వెలసినాయి, పతనమైనాయి. మహాభారతంలో పాండవుల రాజధాని ఇంద్రప్రస్థం అని ఈ నగరాన్ని ప్రస్తావించారు. 19వ శతాబ్దారంభం వరకు "ఇందర్‌పాత్" అనే గ్రామం ఇక్కడ ఉండేది. బ్రిటిష్‌వారి క్రొత్త రాజధాని నిర్మాణంలో ఆ గ్రామం కనుమరుగయ్యింది. క్రీ.పూ. 1000 సంవత్సరాల నాటి రంగువేసిన కూజాలు త్రవ్వకాలలో బయటపడినాయి. పురావస్తు పరిశోధనా సంస్థ (Archaeological Survey of India) వారి అంచనాల ప్రకారం వేల సంవత్సరాలలో నిర్మించిన చారిత్రిక కట్టడాలు 60,000 పైగా ఢిల్లీలో ఉన్నాయి. ఇటీవలి చరిత్రలోనే "ఏడు సామ్రాజ్యాల రాజధాని"గా ఢిల్లీని వర్ణిస్తారు. ఒక ప్రక్క గంగా-యమునా మైదానానికి, మరొక ప్రక్క ఆరావళీ-వింధ్య పర్వత శ్రేణులకు మధ్య ప్రాంతంలో ఉన్నందున పురాతన కాలం నుండీ ఢిల్లీ ప్రధాన వర్తక మార్గాలకు కూడలిగా ఉంది. ఆ కారణంగానే అక్కడ రాజ్యాధికారాలు, విద్య, సంస్కృతి వర్ధిల్లాయి. మౌర్యులకాలం నాటి (క్రీ.పూ. 300) ఆధారాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. అప్పటినుండి ఢిల్లీ అవిచ్ఛిన్నంగా జనావాసంగా వర్ధిల్లింది. శ్రీనివాసపురి ప్రాంతంలో అశోకుని కాలంనాటి శాసనం 1966లో కనుగొన్నారు. ఫిరోజ్‌షా తుగ్లక్ రెండు అశోకుని కాలంనాటి శాసన స్తంభాలను ఢిల్లీకి తెచ్చాడు. కుతుబ్ మినార్ వద్ద ప్రసిద్ధి చెందిన ఉక్కు స్తంభం గుప్తులరాజు కుమారగుప్తునిచే క్రీ.శ. 320-540 మధ్యకాలంలో తయారు చేయించబడింది. దానిని 10వ శతాబ్దంలో ఢిల్లీకి తెచ్చారు.